రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నిట్టూరు విద్యార్థుల ఎంపిక...
సూర్య – పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలం నిట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వికారాబాద్ జిల్లాలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సబ్‌జూనియర్స్ బాలుర రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాలకు చెందిన బి.చరణ్, టి.మణిదీప్ ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ పిట్ట భాస్కర్ తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వికారాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పెద్దపల్లి జిల్లా తరఫున తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. క్రీడల పట్ల ఆసక్తి, నిరంతర సాధన, క్రమశిక్షణతో ముందుకు సాగిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.లక్ష్మయ్యతో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.