రేపు చాపల చెరువుకు జలహారతి... భారీ సంఖ్యలో హాజరుకానున్న మహిళలు, రైతులు.
కళ్యాణదుర్గం: మండలంలోని చాపిరి చెరువుకు నీరు చేరి మరువ పారుతుండటంతో గ్రామ రైతులు, ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో చెరువుకు జలహారతి ఇచ్చేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. గురువారం (నవంబర్ 12) ఉదయం 10 గంటలకు చాపిరి చెరువు వద్ద ప్రత్యేకంగా జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చెరువులోకి నీరు చేరి మరువ పారడం గ్రామానికి శుభపరిణామమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నిండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడటంతో పాటు వ్యవసాయానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు చెరువులోకి నీరు చేరడం కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ రైతులు, మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, చెరువుకు జలహారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. నీటి ప్రాధాన్యతను చాటిచెప్పడంతో పాటు జలవనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి మేలు జరగడంతో పాటు పశుపోషణకు కూడా నీటి ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు పేర్కొంటున్నారు. చాపిరి చెరువు నిండిన ఆనందాన్ని అందరితో పంచుకునే ఈ జలహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామ రైతులు పిలుపునిస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి