కూటమి విజేతలకు సత్కారం
. నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం పరిధిలో కూటమి తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బుధవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి మండలం రామవరం గ్రామంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి మార్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేతలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని విజేతలకు సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ విజయానికి ప్రధాన కారణమని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పనితీరుకు లభించిన గుర్తింపుగా పేర్కొన్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెండున్నర సంవత్సరాల సమయానికి కొంత మేర ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడం సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నికల్లో సాధించిన విజయంతో బాధ్యత మరింత పెరిగిందని, ప్రజలు తమకు అప్పగించిన పదవులను ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని విజేతలకు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకొని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే విధంగా కూటమిని ఆశీర్వదించి అఖండ విజయాన్ని అందించాలని నాయకులు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల సహకారం, ఆశీర్వాదాలు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విజేతలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.