ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.. డీహెచ్‌ఎస్‌సీఓకు వినతిపత్రం సమర్పించిన ఉద్యోగ సంఘ నాయకులు
కడియం ,మేజర్ న్యూస్,మండల కేంద్రం కడియం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడు సీహెచ్.ఎస్. విల్సన్ పాల్ కోరారు. ఈ మేరకు జిల్లా ఆరోగ్య సేవల సమన్వయ అధికారి, కొవ్వూరు డాక్టర్ ఎం. పద్మను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు.కడియం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘ నాయకులు వివరించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.
దీనిపై డాక్టర్ ఎం. పద్మ సానుకూలంగా స్పందిస్తూ, తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, ఖాళీగా ఉన్న పోస్టులను ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన పరిధిలో లేని సమస్యలను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్.ఎస్. విల్సన్ పాల్, రాజమహేంద్రవరం రూరల్ తాలూకా కార్యదర్శి పి. మురళీకృష్ణ, కొవ్వూరు తాలూకా నాయకులు ఏ.జె.డి. మణి, ఎస్. సత్యవాణి, పర్వీన్, కడియం సీహెచ్‌సీ ఉద్యోగులు రేచల్ రూత్, ఎలిజబెత్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.