నీటి వృథా, దుమ్ము కాలుష్యంపై సర్పంచుల ఆందోళన
ఝరాసంగం ః మండలంలో నీటి సంరక్షణ, ముందస్తు జాగ్రత్తలపై బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రత్యేక సమావేశంలో బర్దిపూర్ సర్పంచ్ రాజు, ఎల్గోయి సర్పంచ్ పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఎస్‌ఆర్‌ఆర్ కంపెనీ వద్ద నీటి వృథా జరుగుతోందని బర్దిపూర్ సర్పంచ్ రాజు ప్రస్తావించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడకుండా పరిశ్రమల వద్ద నీటి వినియోగంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, నీటి వృథాను అరికట్టాలని కోరారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా పరిశ్రమలకు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్, దుమ్ము కాలుష్యంపై ఎల్గోయి సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ కార్యకలాపాలు, భారీ వాహనాల రాకపోకలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టిప్పర్లలో వాహన సామర్థ్యానికి మించి మట్టిని లోడ్ చేసి తరలించడం వల్ల రహదారులపై మట్టి పేరుకుపోయి వాహనదారులు జారి చిన్నపాటి ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వాహనదారులు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.మైనింగ్‌కు ఎన్ని అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తే ఉపేక్షించకూడదని, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి మైనింగ్ అనుమతులు, తవ్వకాల పరిమితులు, టిప్పర్ల ఓవర్‌లోడింగ్‌ను పరిశీలించాలని కోరారు. సామర్థ్యానికి మించి మట్టి తరలించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని, టిప్పర్లకు తప్పనిసరిగా కవర్లు ఏర్పాటు చేయించాలని, రహదారులపై పడిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే మైనింగ్ ప్రాంతాలు, రవాణా మార్గాల్లో క్రమం తప్పకుండా నీటిని చల్లడం ద్వారా దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించాలని, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల గ్రామాల ప్రజల ఆరోగ్యం, రహదారి భద్రతకు ముప్పు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.పరిశ్రమలు, మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఉన్నంత మాత్రాన ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను పట్టించుకోకుండా ఉండకూడదని, నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఉల్లంఘనలు గుర్తిస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటి వృథా, కాలుష్యం, రహదారి ప్రమాదాల సమస్యలకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.