ఖచ్చితమైన, నాణ్యమైన డేటా సేకరించాలి
పార్వతీపురం, సూర్య : జనాభాగణనలో భాగంగా ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు ఖచ్చితమైన సమాచారం సేకరించేలా శిక్షణ అందించాలని జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత తెలిపారు. రెండవదశ జనాభా గణన కు సంబంధించి మండల క్షేత్సస్థాయి శిక్షకులకు బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మూడు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని జనాభా గణనకు సంబంధించిన సామగ్రి కిట్ లను అందజేసారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ జనాభా గణన రెండవ దశలో భాగంగా 40 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించాలని తెలిపారు. మండలంలో గ్రామ స్థాయి ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు ఖచ్చితమైన సమాచారం సేకరించుటకు కావలసిన శిక్షణను పూర్తిగా అందించాలని తెలిపారు. ప్రజల నుండి సమాచారం సేకరించడంతో పాటు స్వీయగణన ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలను సెన్సస్ అధికారిక పోర్టల్ ద్వారా లేదా సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం ఉపయోగించుకొనేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాకు రావలసిన నిధులు, పధకాలరూపకల్పనకు ఈ డేటా అత్యంత కీలకమైనది, కాబట్టి డేటా యొక్క నాణ్యత మరియు ఖచ్చితత్వం అత్యంత ప్రాధాన్యమైనవిగా గుర్తించాలని తెలిపారు. శిక్షణ సమయంలో అందరికీ క్షుణ్ణంగా విషయాలు వివరించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. ఏ చిన్న సందేహం వచ్చిన వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. సెల్ఫ్-ఎన్యుమరేషన్ను ఈసారి విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లాలని ఉద్యోగులు, ఉపాద్యాయులు, విద్యావంతులైన ప్రతి ఒక్కరు సెల్ఫ్- ఎన్యుమరేషన్ చేసుకొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారిణి పి. సునీత, జనగణన జిల్లా ఇంచార్జి బి. కేశవరావు, జిల్లా కోఆర్డినేటరు ప్రతాప్ చంద్ర నందా, మాస్టర్ ట్రైనర్ పి.ఎస్.ఎల్.సత్యలక్ష్మీకుమార్ పాల్గొన్నారు.