వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం
కీసర, మేజర్ న్యూస్: చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఆండాళ్ అమ్మవారు, రామానుజులవారు, మనవాళ్ల మహాముని, నమ్మాళ్వార్ గజ విగ్రహాలతో పాటు పుష్కరిణిలో జల లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో యాదాద్రి రిటైర్డ్ ప్రధాన అర్చకులు నల్లందిగుల్ నరసింహాచార్యుల మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రతిష్ఠోత్సవాలు నిర్వహించనుండగా, 13వ తేదీన ప్రధాన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది.ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేద పండితులతో కలిసి ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరి, వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ప్రతిష్ఠోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.