అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి సాగు చేపట్టాలని సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన సర్పంచులు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు