చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక
దుర్గి మండల ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వడ్డె శ్రీనివాసరావు సూచించారు. కొందరు సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.10 వేలు, రూ.20 వేలు ఇస్తామంటూ వారి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని అక్రమ లావాదేవీలకు వినియోగిస్తున్నారని తెలిపారు.ఇలాంటి మోసాల వెనుక ఉన్న అసలు విషయాలు తెలియకుండానే తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్న ఖాతాదారులు చివరకు పోలీసు కేసులు, ఎఫ్ఐఆర్లలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు చేసే అక్రమ లావాదేవీలకు తమ ఖాతాలు వేదికగా మారితే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.కేవలం కొంత డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగించి భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని సూచించారు. ఎవరూ తమ బ్యాంకు ఖాతాలను ఇతరుల లావాదేవీల కోసం వినియోగించేందుకు అనుమతించకూడదన్నారు. బ్యాంకు ఖాతాల భద్రత, సైబర్ మోసాల నివారణకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమాచారం అవసరమైతే నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలని మేనేజర్ వడ్డె శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి