ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలని, దాని విస్తరణలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని రాష్ట్రస్థాయి సీనియర్ థీమాటిక్ లీడ్ చక్రాల చంద్రశేఖర్ సూచించారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని స్వచ్ఛందంగా ఆచరించడంతో పాటు తోటి రైతులకు అవగాహన కల్పించాలని, మహిళా సంఘాలు గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ ఈ కార్యక్రమం విస్తరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో బుధవారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని పొదుపు మహిళా ఐక్య సంఘం భవనంలో పొదుపు లక్ష్మి ఐక్య సంఘం గౌరవ సలహాదారురాలు విజయభారతమ్మ అధ్యక్షతన ఒకరోజు బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు తమ సొంత కార్యక్రమంగా స్వీకరించడంలో ఎదురవుతున్న అడ్డంకులు, క్షేత్రస్థాయిలో రైతులు, కమ్యూనిటీ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలు అన్వేషించడం, మహిళా సంఘాల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు సేకరించారు. ఓర్వకల్లు, పాణ్యం మండలాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, గ్రామస్థాయిలో సమన్వయంతో అమలు చేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పీడీ శ్రీధర్ రావు, కర్నూలు జిల్లా డీపీఎం మాధురి, నంద్యాల జిల్లా డీపీఎం శ్రీనివాసులు, కమ్యూనికేషన్ టీఎల్ సురేష్, నరేంద్ర, ప్రవీణ్, అదనపు డీపీఎంలు లక్ష్మయ్య, సలాం, ఏపీఎం వెంకటరామిరెడ్డి, ఐసీఆర్పీలు, వీఓఏలు, సంఘ సభ్యులు, రెండు జిల్లాల డీపీఎంయూ సిబ్బంది పాల్గొన్నారు.