కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్ః మంత్రి సీతక్క
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం, ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం ఒక సిద్ధాంతం కాదని, తరతరాలుగా వివక్షకు గురైన వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే బాధ్యత అని స్పష్టం చేశారు. మాదాపూర్ హెచ్ఐసీసీలోని భారత్ సమ్మిట్–2026లో భాగంగా నిర్వహించిన సామాజిక న్యాయంపై చర్చలో మంత్రి సీతక్క ప్రసంగించారు. తెలంగాణలోని ఒక మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి నేడు మంత్రిగా ప్రజల ముందు నిలబడటం తన జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, విద్య, ప్రజాసేవల ఫలితమని తెలిపారు. తనలాంటి గ్రామాల్లో ఎంతోమంది అమ్మాయిలకు ఎన్నో కలలు ఉన్నాయని, కానీ సరైన అవకాశాలు లేక వారి ప్రతిభ వెలుగులోకి రావడం లేదని అన్నారు. ప్రతిభ లేక వెనుకబడటం లేదని, అవకాశాలు అందక వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం, ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించడమేనని, వ్యక్తి విలువను కులం ఆధారంగా నిర్ణయించకూడదని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కేవలం మంచి ఉద్దేశాలు సరిపోవని, విధానపరమైన, నిర్మాణాత్మక మార్పులు అవసరమని పేర్కొన్నారు. ఒక సమాజం సాధించిన అభివృద్ధిని ఆ సమాజంలోని మహిళల పురోగతి ఆధారంగా అంచనా వేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు.
మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలు, ఉపాధి కల్పించేవారు, నిర్ణయాధికారులు, నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి భవనాల ద్వారా గ్రామీణ మహిళలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలు అవకాశాల కోసం గ్రామాలను వదిలి వెళ్లకుండా, అవకాశాలే వారి వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కులగణన సమాజంలో విభజనలు సృష్టించదని, తరతరాలుగా కొనసాగుతున్న అసమానతలను వెలుగులోకి తెస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కులగణన అనేది సమాజానికి ఎక్స్‌రే లాంటిదని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని సమాన అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన నిర్వహించి కులాల వారీగా గణాంకాలను ప్రకటించడం ద్వారా సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేశామని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న 'జిత్నీ ఆబాదీ ఉత్నా హక్' నినాదం జనాభా ప్రాతిపదికన హక్కులు, ప్రాతినిధ్యం కల్పించాలనే భావనను ప్రతిబింబిస్తుందని అన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని, ప్రాతినిధ్యం వారి గొంతుకకు బలాన్నిస్తుందని, నిర్మాణాత్మక మార్పులే సమానత్వాన్ని సాధ్యం చేస్తాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం మరో తరం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదని, అది భవిష్యత్తులో అందించే హామీ కాదని, ప్రస్తుత తరానికి దక్కాల్సిన హక్కు అని స్పష్టం చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్లు న్యాయం ఆలస్యమైతే అది న్యాయాన్ని నిరాకరించడమేనని గుర్తుచేశారు. దేశమంటే మట్టి కాదని, దేశమంటే మనుషులని గురజాడ అప్పారావు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చివరి గ్రామం, చివరి కుటుంబం, చివరి వ్యక్తికి చేరినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని అన్నారు. ఆదివాసీ కుటుంబానికి రహదారి అంటే ఆసుపత్రి, పాఠశాల, మార్కెట్‌కు చేరుకునే అవకాశం అని, ఆదివాసీ బాలికకు విద్య అంటే మెరుగైన భవిష్యత్తుకు తొలి అడుగు అని వివరించారు. గ్రామీణ మహిళకు ఆర్థిక స్వావలంబన అంటే గౌరవం, స్వేచ్ఛ, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం అని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజయాన్ని నగరాల్లో నిర్మించే ఎత్తైన భవనాలతో కాకుండా, అత్యంత వెనుకబడిన ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుతో కొలవాలని అన్నారు. కులం ఎవరి భవిష్యత్తును నిర్ణయించకూడదని, మహిళ అనే కారణంతో కలలకు పరిమితులు ఉండకూడదని, పేదరికం ఎవరి గౌరవాన్ని దూరం చేయకూడదని స్పష్టం చేశారు. పుట్టింది పల్లెలో అయినా కలలు కనడానికి హద్దులు ఉండకూడదని, ఏ కులంలో పుట్టినా ఎదగడానికి అడ్డంకులు ఉండకూడదని, ఆడపిల్ల అనే కారణంతో ఆశలు ఆగిపోకూడదని అన్నారు. తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ పదో తరగతి తర్వాత చదువును ఆపి తొమ్మిది నుంచి పదేళ్ల పాటు ఉద్యమ జీవితాన్ని గడిపానని, అనంతరం తిరిగి విద్యను కొనసాగించానని తెలిపారు. నక్సలైట్ కేసుల విచారణ జరిగిన కోర్టులోనే న్యాయ విద్యను ప్రారంభించి, ఐదేళ్ల తర్వాత అదే కోర్టులో జూనియర్ అడ్వకేట్‌గా అడుగుపెట్టి నక్సలైట్ నాయకుల కేసుల్లో వాదించానని గుర్తుచేశారు. ఒకప్పుడు జూనియర్ అడ్వకేట్‌గా అడుగుపెట్టిన అదే ప్రదేశానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని అన్నారు. విద్య అనేది ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధమని నెల్సన్ మండేలా చెప్పిన మాటలను ప్రస్తావించారు. ఒక చిన్న ఆదివాసీ గ్రామం నుంచి ఈ స్థాయికి చేరుకున్న చివరి అమ్మాయిని తాను కావొద్దని, తనలాంటి ప్రయాణాలు సాగించేందుకు లక్షలాది మంది అమ్మాయిలకు అవకాశాలు కల్పించే వారిలో ఒకరిగా ఉండాలనుకుంటున్నానని సీతక్క ఆకాంక్షించారు. అన్యాయాన్ని ఎదిరించేవాడే న్యాయానికి ఆరాధ్యుడని కాళోజీ నారాయణరావు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు ఎవరినీ అణగదొక్కని తెలంగాణను నిర్మించడమే లక్ష్యమని, గొంతు కోల్పోయిన వారికి స్వరం, గౌరవం నిరాకరించబడిన వారికి ఆత్మగౌరవం కల్పించాలని అన్నారు. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందన్నదే కాకుండా, ఎంతమంది జీవితాలను మార్చగలిగామన్నదే తెలంగాణ రైజింగ్ విజయానికి అసలైన కొలమానమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అభివృద్ధి రాష్ట్రాన్ని సంపన్నం చేస్తే, సామాజిక న్యాయం సమాజాన్ని గొప్పదిగా తీర్చిదిద్దుతుందని అన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.