సూర్య,వేములవాడ : ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాటి కళ్యాణి నవంబర్ 4న మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటికి తాళం వేసి నాగయ్యపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఆమె అత్త రమ ఫోన్ చేసి ఇంటి తాళం పగలగొట్టి ఉన్నట్లు సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకున్న కళ్యాణి పరిశీలించగా, ఇంటి తాళంతో పాటు బీరువా తాళం కూడా పగలగొట్టి ఉండటాన్ని గుర్తించింది. బీరువాలో భద్రపరిచిన సుమారు 1.5 తులాల బంగారు గొలుసు, ఏడు వెండి మొలతాళ్లు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వేములవాడ రూరల్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని దొంగల ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.