telangana
ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ గండం
సూర్య ఎండపల్లి ;పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల బిల్లుల మంజూరులో భాగంగా 3 లక్షల 40వేలు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుండగా మిగిలిన పద్దు ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రాంజీ పథకం తో సంధానం చేసి లబ్ధిదారుని ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యంతో ఇంటి నిర్మాణానికి అందాల్సిన ఆర్థిక సాయం లబ్ధిదారుడికి అందకుండా నిలిచిపోయింది. ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన లబ్ది దారులు ఇంటికి స్లాబు వేసి రెండు నెలలు గడుస్తున్నా నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు సంబంధిత అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడం తో ఉపాధి హామీ నుండి అందాల్సిన ఆర్థిక భరోసా అందడం లేదని లబ్ది దారులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ది దారులు అవసరమైన పత్రాలు అందజేసినా సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం వారి పని తీరుకు అద్దం పడుతోంది. ప్రభుత్వం పేదల కోసం నిధులు కేటాయిస్తున్నా, వాటిని లబ్ధిదారులకు చేరవేయాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్న పేదవాడు తనకు రావాల్సిన సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. రెండు నెలలుగా ఫొటోలు అప్‌లోడ్ చేయని అధికారుల బాధ్యత ఎవరిది? ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ చేస్తున్న యంత్రాంగం ఏం చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి జాప్యానికి కారణాలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు లబ్ధిదారుడికి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సాయం వెంటనే అందేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.