ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్.
మెలియాపుట్టిలో 58.95 శాతం ఓటింగ్ నమోదు
మెలియాపుట్టి. నవంబర్ .5. మేజర్ న్యూస్.....
ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మెలియాపుట్టి మండలంలో మందకొడిగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మండలవ్యాప్తంగా 58.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎంపీడీవో పి.నరసింహప్రసాద్ తెలిపారు.
మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి సంబంధించి మొత్తం 58 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. మండలవ్యాప్తంగా 47,065 మంది ఓటర్లు ఉండగా, వారిలో 58.95 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా కేంద్రాల్లో ఓటింగ్ నెమ్మదిగానే కొనసాగింది. ఓటర్లు విడతలవారీగా కేంద్రాలకు చేరుకున్నారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో మండలంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.