మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ.
పోలింగ్ ముగింపు వేళ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
- జిల్లా ఎస్పీ ఆదేశం
అనకాపల్లి / మాకవరపాలెం, నవంబర్ 5, మేజర్ న్యూస్: ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. గురువారం మాకవరపాలెం మండలంలోని మాకవరపాలెం, జి.గంగవరం, భీమబోయినపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ ముగిసే సమయం అత్యంత కీలకమైనదని, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని కేంద్రాల నుంచి సురక్షితంగా వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అనవసరంగా గుమిగూడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని రిసెప్షన్ / స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియ ఎస్కార్ట్ బందోబస్తు మధ్య అత్యంత కట్టుదిట్టంగా జరగాలని సూచించారు. సెక్టార్ అధికారులు, ప్రత్యేక బలగాలు, స్థానిక సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ పర్యటనలో సీఐలు బాల సూర్యారావు, నాగేశ్వరరావు, సింహాద్రి నాయుడు, ఎస్ఐ దామోదర్ నాయుడు, సెక్టార్ అధికారులు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు.