కోటబొమ్మాళిలో ప్రశాంతంగా స్థానిక పోరు
- 69.06% పోలింగ్ నమోదు
- క్యూలో నిలబడి ఓటేసిన మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 5, మేజర్ న్యూస్:
మండలంలో సుదీర్ఘంగా ఎదురుచూసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. కొన్ని గ్రామాల్లో చోటుచేసుకున్న స్వల్ప చెదురుముదురు వివాదాలు మినహాయిస్తే, మండల వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలు ప్రారంభమైన సమయానికి ఓటర్ల రాక చాలా మందకొడిగా సాగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ దైనందిన పనుల్లో నిమగ్నం కావడంతో ఉదయం 11 గంటల సమయానికి కేవలం 20 శాతం మేర మాత్రమే ఓటింగ్ నమోదైంది. అయితే, మధ్యాహ్నం వేళకు ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ స్పష్టంగా కనిపించింది. చివరికి పోలింగ్ ముగిసే సమయానికి మండలంలో
69.06 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. జగన్మోహణరావు అధికారికంగా వెల్లడించారు. 2021 ఎన్నికలలో 58.36 పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు అది సుమారు 10 శాతం పెరిగింది.
- క్యూలైన్లో సాధారణ పౌరుడిలా కేంద్ర, రాష్ట్ర మంత్రులు
మండలంలోని నిమ్మాడ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సాధారణ పౌరుడిలా క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
- అధికారుల ఆకస్మిక తనిఖీ, పర్యవేక్షణ
ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మండలంలోని కొత్తపేట, కోటబొమ్మాళి, అక్కయ్యవలస, కిష్టుపురం, పాకివలస తదితర గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, తహసీల్దార్ చింతలపూడి ప్రసాదరావులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల సమక్షంలో సిబ్బంది పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించారు.
- పోలీసులు అప్రమత్తత, ముందస్తు చర్యలు
పట్టుపురం, చిన్నహరిశ్చంద్రపురం, బాసన్నపేట, కన్నేవలస, గంగరాం గ్రామాల్లో స్థానిక రాజకీయ వర్గాల మధ్య స్వల్ప వివాదాలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు తక్షణమే స్పందించి ఇరువర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అతి సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు వి. సత్యనారాయణ, రెల్లయ్యల పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల ముందస్తు చర్యలు, పటిష్టమైన భద్రత కారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.