గ్రామ పంచాయతీల సొంత నిధుల వినియోగంలో ప్రభుత్వ ఉపశమనం..…
నర్సాపూర్;2018 పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరుల వినియోగం, ఉప సర్పంచుల సంయుక్త చెక్ పవర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ మెదక్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మధుకర్ రెడ్డి గురువారం నర్సాపూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా సొంత నిధుల వినియోగంలో ఖజానా అనుమతులు తప్పనిసరి కావడం, మరోవైపు ఉప సర్పంచులు సంతకాలు చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలను గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామ పంచాయతీల సొంత నిధులను ఖజానాతో సంబంధం లేకుండా నేరుగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించారని, అలాగే ఎలాంటి కారణం లేకుండా ఉప సర్పంచులు చెక్ పై సంతకం చేయని పక్షంలో వారిపై చర్యలు తీసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేసి గ్రామ పంచాయతీలకు కొంత మేర ఉపశమనం కలిగించారని తెలిపారు.సర్పంచుల సమస్యలను అర్థం చేసుకొని సత్వర నిర్ణయం తీసుకున్న మంత్రి సీతక్కకు మెదక్ జిల్లా సర్పంచుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.భవిష్యత్తులో ఉప సర్పంచుల సంయుక్త చెక్ పవర్ ను పూర్తిగా తొలగించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు…