గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి – కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి : గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన గ్రాడ్యుయేట్లు ఫారం-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని, జాబితాలో వివరాలు తప్పుగా ఉన్నవారు వాటిని సరిచేసుకోవాలని సూచించారు.
ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ సిబ్బంది వివరాలను సమగ్రంగా సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రతి సంస్థలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది, గ్రాడ్యుయేట్లు, ఇప్పటికే ఓటరుగా నమోదైనవారు, ఇంకా నమోదు కానివారి వివరాలను సంస్థల వారీగా పరిశీలించి, అర్హులైన వారందరితో ఫారం-18 ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు.
అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నమోదు సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీగా గ్రాడ్యుయేట్ల వివరాలు సేకరించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా అర్హులను గుర్తించి నమోదు చేయించాలని ఆదేశించారు.
ASD జాబితాల్లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారిని గుర్తించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ఫారాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేసి, తక్కువ నమోదు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశిత గడువులోగా ఓటర్ల నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వి. శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్