రాజ్యాంగ రక్షణకు కేఎల్ఆర్ కదం!
రంగారెడ్డి : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ ఘనంగా జరిగింది. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పాల్గొన్నారు.
కేఎల్ఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీకి తరలివచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నినదించాయి.
ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వి శ్రీనివాస చారి : మేజర్ న్యూస్ - రంగారెడ్డి.