పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టారు..
నాగర్‌కర్నూలు: పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేళ్లపాటు పడావు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాగర్‌కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే నేడు కృష్ణా జలాలను ఎత్తిపోయలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే నేడు రాష్ట్రానికి నీటి సమస్య ఉండేదా అని ఆయన ప్రశ్నించారు.
గత పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారని, కానీ పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం కనీసం రూ. 10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని సీఎం విమర్శించారు. గత దశాబ్ద కాలంలో కృష్ణా జలాల వాటా విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఆదరించిన పాలమూరు జిల్లా అంతటా కృష్ణా నీళ్లను పారించి, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.