పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌పై విచారణ
సూర్య అంతర్జాతీయ డెస్క్: పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆడమ్ గ్లాపిన్‌స్కీని దేశంలోని స్టేట్ ట్రిబ్యునల్ ముందు నిలబెట్టేందుకు ప్రయత్నించడం చట్టవిరుద్ధమని, ఇది సెంట్రల్ బ్యాంక్ స్థిరత్వంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ హెడ్ హెచ్చరించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై వచ్చే రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలను విచారించే ప్రత్యేక న్యాయస్థానమైన స్టేట్ ట్రిబ్యునల్‌కు గ్లాపిన్‌స్కీని పంపాలని అక్టోబర్‌లో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి చర్యలు రుణ ఖర్చులను పెంచడంతో పాటు ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితికి దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలాండ్ రాజకీయాల్లో సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత జాతీయవాద ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రతను గ్లాపిన్‌స్కీ దెబ్బతీశారని ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ 2023లో అధికారంలోకి రాకముందు నుంచే ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు వడ్డీ రేట్ల తగ్గింపులు, ద్రవ్యలోటు భర్తీకి బాండ్ల కొనుగోళ్లు, కరెన్సీ జోక్యాలు వంటి అంశాలపై విమర్శలు తలెత్తాయి. అయితే ఈ ఆరోపణలన్నింటినీ గ్లాపిన్‌స్కీతో పాటు సెంట్రల్ బ్యాంక్ వర్గాలు గట్టిగా తిరస్కరిస్తున్నాయి. తమ నిర్ణయాలన్నీ చట్టబద్ధమైన పరిధిలోనే జరిగాయని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయలేదని స్పష్టం చేస్తున్నాయి.
పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. గ్లాపిన్‌స్కీని స్టేట్ ట్రిబ్యునల్ ముందుకు తీసుకురావాలా వద్దా అనే అంశంపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఆయన పదవీకాలం 2028 వరకు ఉన్నప్పటికీ మధ్యలో సస్పెన్షన్ వంటి పరిణామాలపై న్యాయపరమైన, రాజకీయపరమైన చర్చలు వేడెక్కాయి. మరోవైపు దేశ రాజ్యాంగ న్యాయస్థానం నాయకత్వ వ్యవహారంలోనూ ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ మధ్య మాటల తూటాలు పేలాయి. సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తుండగా, సంస్థాగత స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని సెంట్రల్ బ్యాంక్ వర్గాలు పట్టుబడుతున్నాయి.
ఆర్థిక నిపుణులు, మదుపర్లు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ అధిపతిపై విచారణ ప్రక్రియ ముందుకు సాగితే విదేశీ పెట్టుబడులు, కరెన్సీ విలువ, ప్రభుత్వ రుణ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ, న్యాయపరమైన ఘర్షణలు ఆర్థిక సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయకుండా చూడాలని డిప్యూటీ హెడ్ చేసిన వ్యాఖ్యలు పోలాండ్ ఆర్థిక భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.