2029 తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తే అమీర్‌పేట్ చౌరస్తాలో పాతరేస్తాం..
హైదరాబాద్: యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన మూడు రోజుల 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' పాదయాత్ర రెండో రోజు గురువారం ముగిసింది. ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర నగరంలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ డ్రగ్స్ మాఫియాపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. 2029 తర్వాత రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, సరఫరా చేసినా వారిని అమీర్‌పేట్ చౌరస్తాలో పాతరేస్తామని ఘాటుగా హెచ్చరించారు. కేవలం ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో తాము ఈ యాత్ర చేయడం లేదని, సమాజ హితం కోసమే డ్రగ్స్‌పై సమరశంఖం పూరించామని స్పష్టం చేశారు.
డ్రగ్స్ మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాల కట్టడి అనేది కేవలం పోలీసులు, ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఆ బాధ్యత ఉందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ 'నషా ముక్త్ భారత్ వారియర్స్'గా మారి మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. కాగా, ఈ పాదయాత్ర శుక్రవారం జూబ్లీహిల్స్ వద్ద ముగియనుంది.