ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రముఖ ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూ 2018 నాటి అత్యాచార ఆరోపణలపై న్యాయస్థాన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన న్యాయవాది డేవిడ్ ఒలివియర్ కామిన్స్కీ గురువారం వెల్లడించారు. నటి షార్లెట్ ఆర్నాల్డ్ 2018లో తన పారిస్ నివాసంలో రెండు వేర్వేరు సందర్భాలలో డిపార్డియూ తనపై లైంగిక దాడి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణకు ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డిపార్డియూ తరఫు న్యాయ బృందం అప్పీల్ చేయగా, గురువారం నాటి న్యాయస్థాన నిర్ణయంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగనుందని న్యాయవాది తెలిపారు.
77 ఏళ్ల డిపార్డియూ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఎప్పటి నుంచో ఖండిస్తూ వస్తున్నారు. పారిస్ అప్పీల్ కోర్టు పరిశీలన తర్వాత కేసు విచారణకు మార్గం సుగమమైందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్రెంచ్ సినిమా రంగంలో దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా నిలిచిన డిపార్డియూపై వరుసగా వస్తున్న న్యాయపరమైన పరిణామాలు అంతర్జాతీయంగా సినీ, న్యాయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవలి వారాల్లో డిపార్డియూకు సంబంధించి పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2021లో ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 2025 మేలో ఆయనకు కోర్టు శిక్ష విధించగా, ఇటీవల ఆ శిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. అలాగే 2018లో మరో చిత్రీకరణ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
మొత్తంగా షార్లెట్ ఆర్నాల్డ్ దాఖలు చేసిన కేసులో విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, రానున్న న్యాయ ప్రక్రియపై అందరి దృష్టి నిలిచింది. కోర్టు విచారణలో వెలువడే వాదనలు, సాక్ష్యాధారాలు, తుది తీర్పుపై సినీ, న్యాయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.