గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. ట్రైనీ పైలట్, ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలు
హైదరాబాద్: నగరంలోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ పరిధిలో గురువారం ఓ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో 'సెస్నా-152' రకం శిక్షణ విమానాన్ని పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పిన విమానం కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్‌తో పాటు ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది, స్థానిక అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ విమాన ప్రమాదంపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు.