బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామే.. : సీఎం రేవంత్ రెడ్డి
నాగర్‌కర్నూలు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. 50 ఏళ్ల క్రితం బీజేపీ లేదని, పాతికేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ లేదని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారం కోల్పోతే ఆ పార్టీ చచ్చిన పాముతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుండి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 'ఎత్తిపోతల పథకంలో' ఉన్నారని ఎద్దేవా చేశారు. గత 34 నెలలుగా కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని, కనీసం అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ, ఈ 34 నెలల కాలంలో ఆయన రెండున్నర కోట్ల రూపాయల వరకు జీతభత్యాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో చేసిన తప్పులకు ప్రజలకు మొహం చూపించలేకే కేసీఆర్ బయటికి రావడం లేదని అన్న ఆయన, ఇలాంటి నాయకుడిని ఏ విధంగా శిక్షించాలో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు.