రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన
నవాబుపేట సూర్య న్యూస్:భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండల పరిధిలోని చౌడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి,ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బండి రమాకాంత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా బండి రమాకాంత్ మాట్లాడుతూ..భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు స్వేచ్ఛగా తమ హక్కులను వినియోగించుకునే అవకాశం కలిగిందన్నారు.ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులు,స్వేచ్ఛా ఫలాలను పొందాలంటే రాజ్యాంగ విలువలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే రాజ్యాంగ గొప్పతనాన్ని,దాని విలువలను తెలుసుకొని బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ బాబు,రామచంద్ర,యాదయ్య,గణేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.