రాజ్యాంగ స్ఫూర్తితో ఉత్తమ పౌరులుగా ఎదగాలి
గాజువాక, మేజర్ న్యూస్: ప్రపంచ మేధావుల్లో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఎంఈవో రమణాజి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం నడుపూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ అపురూప ఘట్టాల ప్రదర్శన నిర్వహించారు. ఇన్‌ఛార్జి హెచ్ఎం రాజకుమార్ రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ఉపాధ్యాయురాలు షబానా బేగం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రాధాన్యతను వివరించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నరసింహ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా పఠించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన అంబేద్కర్ చిత్రలేఖనం పోటీలో వంద మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకోగా, క్విజ్ పోటీలకు విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గౌరీ, రవి, అరుణ, శేషకుమారి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం