గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. కాటసాని
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓర్వకల్లు మండలంలోని చింతలపల్లె, పాలకొలను గ్రామాల్లో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న ఎన్నికల పరిస్థితులు, అభ్యర్థుల ప్రచార సరళిపై పార్టీ శ్రేణులతో చర్చించారు.
గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవడంతో పాటు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచుకుంటూ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, ప్రజలతో మమేకమై అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని కోరారు. వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి సర్పంచ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కాటసాని సూచించారు. ఈ సమావేశాల్లో చింతలపల్లె, పాలకొలను గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.