పోమాలలో భూసేకరణపై గ్రామసభ
*--రైతుల అభ్యంతరాలను లిఖితపూర్వకంగా అందించాలి.*
*--ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి.*
నవాబుపేట సూర్య న్యూస్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు,అభ్యంతరాలను తెలుసుకునేందుకు గురువారం మండల పరిధిలోని పోమాల్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు.ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో,గ్రామ సర్పంచ్ కవిత నరేష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..పోమాల గ్రామంలో భూసేకరణ కారణంగా 185మంది రైతులకు చెందిన మొత్తం 127ఎకరాల 19గుంటల భూమి ప్రభావితమవుతోంది.ఈ సందర్భంగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి మాట్లాడుతూ..భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణకు సంబంధించి ఏవైనా సందేహాలు,అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.భూమి వివరాల్లో పేర్ల మార్పులు,వాస్తవానికి మించి భూమి కోల్పోతున్నట్లు భావించడం లేదా ఇతర సమస్యలు ఉంటే వాటిని లిఖితపూర్వకంగా గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రమేష్‌కు వినతిపత్రం రూపంలో అందజేయాలని తెలిపారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ వీరేష్,ఉప ఇంజనీర్ నారాయణ,ఉప సర్పంచ్ ఆంజనేయులు,వార్డు సభ్యులు నర్సమ్మశ్రీశైలం,యాదయ్య, సుమలతశివ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.