బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: వాసు
గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:
నా కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు అది. నా ఆర్థిక పరిస్థితుల వల్ల వాసు అనే వ్యక్తికి అమ్ముకున్నాను. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వాసును బ్లాక్ మెయిల్ చేసి రాజకీయ లబ్ధ పొందాలి అనుకోవటం బాధాకరం అని సయ్యద్ సుభాని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు మండలం చల్లావారిపాలెం గ్రామానికి చెందిన సుభాని గురువారం ఒక హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మస్తాన్ వలి వద్ద నేను 1996లో ఇల్లు కొనుగోలు చేశాను. అనంతరం ఆ ఇంట్లో సుహానా, బాబావలి దంపతులు ఉంటున్నారు. ఇల్లు అమ్ముకున్న తరువాత వాళ్లు ఖాళీ చేస్తాం అన్నారు. ఇల్లు అమ్మి ఆరు నెలలు అవుతుంది. అప్పటినుంచి మిన్నకుండిపోయి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇల్లు కొన్న వాసు పై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. అతనిపై ఫోన్లో ఏవో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిసి బాధపడ్డాను. వారికి నజీర్ అనే వ్యక్తి వత్తాసు పలుకుతున్నాడు. ఇల్లు కొనుగోలు, అమ్ముకునే విషయంపై ఎలాంటి పొరపాట్లు లేవు. ఈ విషయంపై పోలీస్ రెవెన్యూ అధికారులు విచారణ చేయవచ్చు అని సుభాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కొనుగోలు చేసిన మన్నేడి శ్రీనివాసరావు అలియాస్ వాసు మాట్లాడుతూ... ప్రస్తుతం నా భార్య చల్లావారిపాలెం గ్రామ సర్పంచ్ గా పోటీలో ఉన్నారు. నన్ను ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలని ఇల్లు కొనుగోలు చేసి ఆరు నెలల తరువాత తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. భూకబ్జాదారుడు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. అంతకంటే ఎక్కువగా తప్పుడు పోస్టులు నేను కూడా పెట్టగలను. కానీ నాకు సంస్కారం ఒకటి అడ్డు వస్తుంది. చల్లావారిపాలెం గ్రామ ప్రజలకు నేనేమిటో... నా ప్రవర్తన ఏమిటో అందరికీ తెలుసు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మరని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా నన్ను దెబ్బతీయాలి అని కొన్ని దుష్ట శక్తులు ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకోవడం బాధాకరం. ఇలాంటి చౌకబారు ట్రిక్కులు మానుకోవాలని వాసు హితవు పలికారు.
ఆళ్ల వీరభద్రరావు, సీనియర్ జర్నలిస్ట్