telangana
ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు
సూర్య, మందమర్రి : భారతదేశంలో విద్యావ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సింగరేణి మనోవికాస పాఠశాలలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశయాలను, దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా, రచయితగా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అని, అబుల్ కలాం ఆయన బిరుదు కాగా, ఆజాద్ కలం పేరు అని వివరించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సుమారు పదేళ్లపాటు జైలు జీవితం అనుభవించారని గుర్తుచేశారు. 1920లో జాతీయ కాంగ్రెస్‌లో చేరిన ఆయన ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించేందుకు 'అల్ హిలాల్' పత్రిక ద్వారా తన రచనలతో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలి విద్యాశాఖ మంత్రిగా సుమారు 11 సంవత్సరాలపాటు బాధ్యతలు నిర్వర్తించి విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమనే సందేశాన్ని అందించిన ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎం.డి. యాకూబ్, ఎం.డి. షరీఫ్, ఇమామ్ ముజఫర్ హుస్సేన్, ఎం.డి. నిజాం, ఎం.డి. సుకూర్, ఎం.డి. జాఫర్, ఎం.డి. రహమత్ ఖాన్, ఎం.డి. ఇసాక్, ఎం.డి. ఖాజా, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.