చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన
చిట్టమూరు మేజర్ న్యూస్
కోట సిడిపిఓ ముని కుమారి అధ్యక్షతన బుధవారం చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమాన్ని రెండో రోజు నిర్వహించారు.ఈ సందర్భంగా ఓఎస్‌సీ ప్రతినిధి నగ్మా ఉన్నత పాఠశాల విద్యార్థినులకు,అంగన్‌వాడీ కార్యకర్తలకు మహిళా భద్రత, బాలల సంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు,వరకట్న వేధింపులు,మహిళలపై జరిగే హింస,ఆపద సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు, వన్‌స్టాప్ సెంటర్ ద్వారా అందించే సేవల గురించి వివరించారు.మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి సహాయం పొందాలన్నారు.అనంతరం సూపర్‌వైజర్లు కవిత,పద్మలు అంగన్‌వాడీ కార్యకర్తలకు పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, పోషణ,ఈసీసీఈ,గృహ సందర్శనల ప్రాముఖ్యత తదితర అంశాలపై వివరంగా శిక్షణ ఇచ్చారు.చిన్నారుల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారి ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉన్నత పాఠశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు, బాలికల భద్రతతో పాటు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, అభివృద్ధిపై అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్