రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం
కావలి, మేజర్ న్యూస్ : ప్రభుత్వ నిబంధనలకు లోబడి లబ్ధిదారులకు సకాలంలో నాణ్యమైన రేషన్ సరుకులను పంపిణీ చేయాలని కావలి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) శ్రావణ్ కుమార్ చౌక ధరల దుకాణదారులను ఆదేశించారు. బుధవారం కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టణ పరిధిలోని చౌక ధరల (రేషన్) దుకాణదారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భార్గవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో శ్రావణ్ కుమార్, జిల్లా మేనేజర్ భార్గవలు రేషన్ దుకాణదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చౌక దుకాణదారులు తమ పరిధిలోని సమస్యలను, రవాణా మరియు పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కార మార్గాలను సూచించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీ పేద కుటుంబానికి ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా లేదా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో మండల రెవెన్యూ సిబ్బంది, పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు కావలి పట్టణ చౌక ధరల దుకాణదారులు పాల్గొన్నారు.