ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వంగా.వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ ఫణికుమార్, హెలాపురి బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూచిపూడి సత్యనారాయణ, నిర్వహణ కార్యదర్శి గుడాపాటి.నరసింహారావు కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని నమ్మిన ఆయన, దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని విద్య, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.హరిబాబు, కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.