గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక
న్యాల్కల్ : గణేష్‌పూర్ గ్రామంలో తరచూ అక్రమ తవ్వకాలు జరుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు.నిమ్స్ అధికారుల ఫిర్యాదు మేరకు నేడు అనగా 21/11/2026 నాడు ఉదయం గణేష్‌పూర్ గ్రామంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ గారి ఆధ్వర్యంలో, జహీరాబాద్ రూరల్ సీఐ నర్సింలు , హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ మరియు సిబ్బందితో కలిసి గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేశారు.అక్రమ తవ్వకాలు చేస్తున్నారని భావిస్తున్న వారిని అందరినీ హద్నూర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి డీఎస్పీ గట్టిగా హెచ్చరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ - "ఇకపై ఎవరైనా చట్టవ్యతిరేకంగా అక్రమ తవ్వకాలు జరిపినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా ఊరుకోం. వెంటనే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారెవరైనా సరే వదిలిపెట్టం" అని స్పష్టంగా హెచ్చరించారు.పోలీసుల ఆకస్మిక తనిఖీతో గణేష్‌పూర్ గ్రామంలో అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిలో భయం మొదలైంది. ప్రజలు మాత్రం పోలీసుల చర్యను స్వాగతిస్తూ - "ఇలా తనిఖీలు చేస్తేనే గ్రామంలో ప్రశాంతత ఉంటుంది. పోలీసులకు మా ధన్యవాదాలు" అని గ్రామస్తులు అన్నారు.
గ్రామంలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు.