రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి.
గన్నవరం, మేజర్ న్యూస్ : గ్రామాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని, కేసరపల్లిలో ఇప్పటికే రూ.48.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గ్రామంలో మిగిలిన సమస్యలను సైతం పరిష్కరించి మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ నెల 26న జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచి అభ్యర్థి నెరుసు శివ నాగేశ్వరరావు (నాని)తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేసరపల్లి అంబేద్కర్‌నగర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన యార్లగడ్డ వెంకట్రావు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. 133 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు ద్వారా సుమారు 35 వేల కుటుంబాలకు నిరంతర విద్యుత్ అందుతోందని, విద్యుత్ లైన్లకు రూ.5.30 కోట్లు, గృహ, వ్యవసాయ కనెక్షన్లకు రూ.1.62 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 119 కుటుంబాలకు రూ.92.82 లక్షల ప్రయోజనం కల్పించామని, ఏడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ.49 లక్షలు వెచ్చించామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లకు రూ.1.23 కోట్లు, న్యూ హౌసింగ్ కాలనీ రహదారికి రూ.1.98 కోట్లు, ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లకు రూ.43 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. చెరువుల మరమ్మతులకు రూ.44.87 లక్షలు కేటాయించడంతో పాటు వీఎన్‌పురం కాలనీలో పాఠశాల ప్రహరీ, రహదారులు, నీటి సంపు మరమ్మతులు, పశువైద్యశాల, గ్రామ ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. హెచ్‌సీఎల్ సంస్థ సహకారంతో యువతకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, సెమీకండక్టర్ రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. 20 ఏళ్లుగా మూతపడిన సహకార సంఘం బ్యాంకును తిరిగి ప్రారంభించడం గ్రామానికి ఎంతో ప్రయోజనకరమన్నారు. అంబేద్కర్‌నగర్‌లో తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు ఇళ్ల మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి సహకారం కోరామని, అవసరమైతే సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తామన్నారు. విమానాశ్రయ సరిహద్దు సమీపంలోని ఇళ్ల స్థలాల సమస్యపై కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడామని, ఎన్నికల అనంతరం అధికారులతో విచారణ చేయించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఓటమి చెందినప్పటికీ గ్రామాభివృద్ధిలో వివక్ష చూపబోమని, ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా గ్రామానికి అవసరమైన పనులు చేపడతామని యార్లగడ్డ స్పష్టం చేశారు. గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం గ్రామాల్లో చెత్త సమస్య పరిష్కారానికి రూ.54 లక్షలతో చెత్త సేకరణ వాహనాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో నెరుసు శివ నాగేశ్వరరావు (నాని)తో పాటు 16 వార్డుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం, కృష్ణాజిల్లా.