తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం
తాడిగడప, మేజర్ న్యూస్: తాడిగడప మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యనమలకుదురు 24వ వార్డు పరిధిలోని శివపార్వతి నగర్‌లో ఆయన విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి పీతా గోపిచంద్, 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుంకర సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీకి జరుగుతున్న తొలి ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రతి ఓటు విలువైనదని, ఓటును వృథా చేయకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.