తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం
తాడిగడప, మేజర్ న్యూస్: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని 31, 32వ వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ చేస్తున్న ప్రచారాలు, ఆరోపణలకు సమాధానంగా ప్రజల మధ్యకు వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 31వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థి వనమాల వెంకటేశ్వరరావు, 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పులి లక్ష్మీ లలిత కుమారి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీతా గోపిచంద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని బోడె ప్రసాద్ విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధిని ఇప్పుడు ఎన్నికల సమయంలో మాటలతో నమ్మించాలని చూస్తే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు కావాల్సింది మాటలు చెప్పే నాయకులు కాదని, అభివృద్ధి చేసి చూపించే నాయకులని పేర్కొన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలకు ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు నూతన ఊపునిచ్చామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. చైర్మన్ అభ్యర్థి పీతా గోపిచంద్‌తో పాటు 31వ వార్డు అభ్యర్థి వనమాల వెంకటేశ్వరరావు, 32వ వార్డు అభ్యర్థి పులి లక్ష్మీ లలిత కుమారిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారు, ప్రజలకు ఎవరు అండగా నిలుస్తున్నారో వారికి తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు లభిస్తే తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత బలమైన పునాది పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.