దుండిగల్ మేజర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని గాగిల్లాపూర్‌లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్, గుడిసె ఈశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్వామివారిని ప్రార్థించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. దీంతో గాగిల్లాపూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహా పడిపూజ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.