telangana
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి… పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
సూర్య పెద్దపల్లి ప్రతినిధి '; యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. నిషా ముక్త్ భారత్, ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లను నిరంతరం గమనించాలని సూచించారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రహరీ కమిటీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతను నేరస్థులుగా చూడకుండా, వారికి చికిత్స, కౌన్సెలింగ్ అందించి వ్యసనం నుంచి బయటపడేలా సహకరించాలని కోరారు. సింగరేణి మెడికల్ కాలేజీలో డీ-అడిక్షన్ కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు.మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు, వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖకు ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు సహకరిస్తే పెద్దపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీపీ భూక్య రామ్ రెడ్డి, ఏసీపీ జి. కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎస్ఐలు రాజశేఖర్, మధుకర్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.