దివ్యాంగుల క్రీడల్లో మానకొండూర్ విద్యార్థుల ప్రతిభ
సూర్య - మానకొండూర్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీల్లో మానకొండూర్ మండలానికి చెందిన విద్యార్థులు ఘన విజయం సాధించారు. మండలం నుంచి నలుగురు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.క్రీడా విభాగాల్లో అమిగళ్ల వరుణ్ తేజ్ రన్నింగ్లో ప్రథమ బహుమతి సాధించగా, ఎస్.కె. అశ్వాక్ రన్నింగ్లో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారు. అలాగే మ్యూజికల్ చైర్ పోటీల్లో అమిగళ్ల మేఘన, నెల్లి హర్షవర్ధన్ తృతీయ బహుమతులు సాధించి మండలానికి గర్వకారణంగా నిలిచారు. విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి వై.తిరుపతిరావు చేతుల మీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి, పీడీలు, ఐఈఆర్పీలు, స్పెషల్ ఎడ్యుకేటర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.