చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో బోగీలో మంటలు
చర్లపల్లి, మేజర్ న్యూస్ : చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బోగీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. ఈ క్రమంలో బోగీలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.