బ్లాస్టింగ్ దెబ్బకు ఇళ్లకు బీటలు!
గణపురం, మేజర్ న్యూస్, ప్రత్యేక ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ ప్రభావంతో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని గణపురం మండలంలోని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వచ్చే ప్రకంపనలతో ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని, పైకప్పులపై పెంకులు కదిలిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. నగరంపల్లి, ధర్మారావుపేట, పరశురాంపల్లి, వెంకటేశ్వరపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో గని కార్యకలాపాల ప్రభావంపై సమగ్ర పరిశీలన జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో తమ కుటుంబాల భద్రతపై ఆందోళన చెందుతున్నామని పేర్కొంటున్నారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు జరిగిన నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సమస్యపై పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ నగరంపల్లి సర్పంచ్ కొడాలి హైమావతి–ధనుంజయ యాదవ్, స్పందిస్తూ, బ్లాస్టింగ్ ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని కోరుతున్నారు. నగరంపల్లి, ధర్మారావుపేట, పరశురాంపల్లి, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో ఇళ్లకు ఏర్పడిన పగుళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.బ్లాస్టింగ్ ప్రకంపనల తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నివాస ప్రాంతాలకు నష్టం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేలా అధికారులు తక్షణమే స్పందించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్; ఎల్లయ్య, గణపురం, భూపాలపల్లి జిల్లా