18వ వార్డులో డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల బ్రహ్మరథం గడపగడపకు విస్తృత ప్రచారం.. వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యం
రాయదుర్గంఇన్చార్జ్ (రాయదుర్గం, మేజర్ న్యూస్) : రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 18వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీరామ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం నుంచి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి గడపగడపకు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వార్డు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు.
ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో మమేకమైన డాక్టర్ శ్రీరామ్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు మెరుగైన వసతులు అందించడం, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వార్డు అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడికి మద్దతుగా నిలవాలని పార్టీ నాయకులు ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ టౌన్ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, జయంతి సురేష్, కోతిగుట్ట శీనా తదితర నాయకులతో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : శివప్రసాద్ రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.