పండుగకు ఊరెళ్లిన కుటుంబం.. ఇంట్లో భారీ చోరీ:నాలుగు కిలోల వెండి, తులం బంగారం, రూ.25 వేల నగదు అపహరణ
కీసర, మేజర్ న్యూస్:పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఊరెళ్లడంతో, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు నాలుగు కిలోల వెండి వస్తువులు, తులం బంగారం, రూ.25 వేల నగదును అపహరించారు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రెండు రోజుల తర్వాత వెలుగులోకి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర పరిధిలోని ఆర్‌ఎల్ నగర్, ప్లాట్ నంబర్ 17లో రఘు రామ్ కుటుంబం నివాసముంటోంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా వరంగల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూశారు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా కనిపించడంతోపాటు, అల్మారాలో భద్రపరిచిన వెండి వస్తువులు, బంగారం, నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.బాధితుడు వెంటనే కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.