మహిళా సర్పంచుల శిక్షణతో గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలు
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మూడు రోజుల శిక్షణకు హాజరైన సర్దార్‌నగర్ సర్పంచ్ కీర్తి హరీష్
69 మంది మహిళా సర్పంచులతో కలిసి గ్రామాభివృద్ధిపై అవగాహన
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 25) హైదరాబాద్‌లోని డాక్టర్ ఎం.సి.ఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అక్టోబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో సర్దార్‌నగర్ గ్రామ సర్పంచ్ మామిడి కీర్తి హరీష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన 69 మంది మహిళా సర్పంచులతో కలిసి ఆమె శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, గ్రామసభల నిర్వహణ, మహిళా సాధికారత, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, గ్రామ పంచాయతీల పరిపాలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాలు గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడతాయని కీర్తి హరీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేయడంతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్దార్‌నగర్ గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మామిడి కీర్తి హరీష్ తెలిపారు.