బియ్యం నిల్వలు, ధరలపై డీఎస్‌ఓ శ్రీనివాస్ రెడ్డి కఠిన నిఘా.. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : జిల్లాలో బియ్యం నిల్వలు, లభ్యత, ధరలపై పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పౌరసరఫరాల అధికారి వి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సాయంత్రం బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో వివిధ రకాల బియ్యం లభ్యత, నిల్వల వివరాలు, విక్రయ ధరలపై చర్చించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు.వినియోగదారులకు బియ్యం నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా వ్యాపారులు తగినంత నిల్వలు నిర్వహించాలని డీఎస్‌ఓ సూచించారు. అవసరానికి అనుగుణంగా నిల్వలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ న్యాయమైన ధరలకే బియ్యం విక్రయించాలని స్పష్టం చేశారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా బియ్యం నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వ్యాపార ప్రాంగణాల్లో స్టాక్, ధరల బోర్డుల ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆయా బోర్డులపై బియ్యం రకం, అందుబాటులో ఉన్న నిల్వల పరిమాణం, కిలో విక్రయ ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. బియ్యం నిల్వలు, కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ధరల స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పౌరసరఫరాల శాఖకు వ్యాపారులు సహకరించాలని కోరారు.జిల్లాలో బియ్యం మార్కెట్‌ను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, సరఫరా, ధరల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎస్‌ఓ తెలిపారు. ప్రజలు అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేయకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.