పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం. ఆర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామ శివారులోని పాకలు, పెంకుటిళ్లలో నివసిస్తున్న సుమారు 30 యానాది కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.గ్రామ శివారులోని నివాస ప్రాంతాలను బిక్కవోలు తహసీల్దార్ రమాదేవి, ఎస్సై రవిచంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల ప్రమాదం తలెత్తే అవకాశం ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆయా కుటుంబాలకు పరిస్థితిని వివరించి, వారిని బిక్కవోలు సచివాలయం-2లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలకు అవసరమైన వసతి, భద్రతా ఏర్పాట్లు కల్పించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ తరలింపు కార్యక్రమంలో డీటీ కృష్ణ, ఆర్‌ఐ, వీఆర్వో, ఏఎస్సై రఘు, పోలీసు సిబ్బంది యాదవ్, సురేష్‌తో పాటు రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తుఫాన్ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.