నదీ పరివాహక గ్రామాల్లో సబ్ కలెక్టర్ పర్యటన
పాలకొండ, మేజర్ న్యూస్
నాగావళి నదికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసేందుకు సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్ క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించారు. నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి, గోపాలపురం, మంగళాపురం, అన్నవరం గ్రామాల ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆర్నబ్ తుఫాన్ తీవ్రత కారణంగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా నాగావళినది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది సమీప ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఈయన తో పాటు తహసీల్దార్ రాదాకృష్ణ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.