బియ్యం ధరల దోపిడీకి చెక్.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :
బియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. వివిధ రకాల బియ్యానికి గరిష్ఠ విక్రయ ధరలను నిర్ణయిస్తూ, వాటికి మించి ధరలు వసూలు చేసే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. విజయేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చర్చించి ఈ ధరలను ఖరారు చేసినట్లు తెలిపారు. తెలంగాణ బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా కిలో రూ.74, తెలంగాణ శ్రీరామగోల్డ్ కిలో రూ.79గా గరిష్ఠ విక్రయ ధరలను నిర్ణయించినట్లు వెల్లడించారు. రైస్ మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైల్ వ్యాపారులు నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయించరాదని స్పష్టం చేశారు. ప్రతి రిటైల్, హోల్‌సేల్ దుకాణం ఎదుట వివిధ రకాల బియ్యం ధరలను తెలిపే బ్యానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. వినియోగదారులకు ధరలపై స్పష్టత కల్పించడంతో పాటు అధిక ధరల వసూళ్లను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్ణయించిన గరిష్ఠ ధరలకు మించి విక్రయాలు జరిపినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు న్యాయమైన ధరలకు బియ్యం అందేలా వ్యాపారులందరూ ప్రభుత్వ నిర్ణయాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి సూచించారు.